Budameru: బెజవాడ వాసులను బుడమేరు ముంపు ప్రచారం పరుగులు పెట్టించింది. బుడమేరుకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్ళీ ఇళ్లలోకి వరదనీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంతాల వారు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి కంగారు పడిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఫేక్ ప్రచారంగా అధికారులు చెబుతున్నారు. ఎవరు ఈ ప్రచారం చేశారు అనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
Read Also: Minister Narayana: విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి ఆగ్రహం
న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందని కొద్దిసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతున్న తెలిసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, ఈఎన్సీ గోపాల కృష్ణా రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మంత్రి నారాయణ సమాచారం తెలుసుకున్నారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. విజయవాడ పూర్తిగా సేఫ్‌గా ఉందని మంత్రి స్పష్టం చేశారు. బెజవాడలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. బుడమేరు కట్ట మళ్ళీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రచారాలు నమ్మవద్దని పేర్కొ్‌న్నారు.
బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. బుడమేరుకు ఎలాంటి వరదనీరు రావటం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఈ తరహా వదంతుల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు గుర్తించామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.