RR vs RCB: జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 17.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 75 పరుగులతో అద్భుతంగా ఆరంభించాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజు సాంసన్ 15 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురేల్ 35 నాటౌట్, నితీష్ రాణా 4 నాటౌట్‌గా నిలిచారు. ఇక బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక్కో వికెట్ తీశారు.
ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు మొదటి నుంచే విజృంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సాల్ట్ అవుట్ తర్వాత విరాట్ కోహ్లి 62 పరుగులు నాటౌట్, మరియు దేవదత్ పడిక్కల్ 40 పరుగులు నాటౌట్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసి మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ముగించింది. రాజస్థాన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ మాత్రమే వికెట్ తీసాడు. మిగతా బౌలర్లు అందరూ వికెట్లు తీయడంలో వైఫల్యం అయ్యారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన టి20 కెరియర్ లో 100 సార్లు 50 పరుగులను సాధించాడు.