ఏపీకి రోప్ వే హంగులు రానున్నాయా? పర్యాటక ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. ఏపీలో పర్యాటకుల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 26 టూరిస్ట్ ప్రాంతాల్లో రోప్‌వే వేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా రోప్ వేల ఏర్పాటు చేయనుంది. విజయవాడ కనకదుర్గమ్మ కొండపైకి, కృష్ణా నది మీదుగా ఈగలపెంట నుంచి శ్రీశైలం వరకు రోప్ వే ఏర్పాటుకు డీపీఆర్ సిద్దం అయిందని తెలుస్తోంది.
మరో ఆరు చోట్ల డీపీఆర్‌ల తయారీకి ముమ్మర కసరత్తు చేస్తోంది పర్యాటక శాఖ. ఇప్పటికే నేషనల్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీటీడీసీ. మూడు నాలుగు నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశం వుందని అంటున్నారు పర్యాటక శాఖ అధికారులు. రోప్ వేల నిర్వహణ బాధ్యతను నేషనల్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ చేపట్టనుంది.ఏపీకి రోప్‌వే హంగులు రాబోతున్నాయి. కేంద్ర పథకం పర్వత మాల పథకంలో భాగంగా ఏపీలో మొత్తంగా 26 ప్రాంతాల్లో రోప్ వే ఏర్పాటు చేయడానికి కసరత్తు ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. విజయవాడ కనకదుర్గమ్మ కొండ ఇంద్రకీలాద్రి పైకి రోప్ వే ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్దమైంది.
ఏపీలో అతి తక్కువ ప్రదేశాల్లో మాత్రమే రోప్‌వే అందుబాటులో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం, విశాఖ కైలాసగిరి వంటి ప్రాంతాల్లో తప్ప.. మిగిలిన చోట్ల ఎక్కడ రోప్ వే లేదు. అయితే ఆ కొరత తీర్చేందుకు.. పైనుంచి ప్రకృతి అందాలను చూసి పులకరించేందుకు ఏపీలో భారీ ఎత్తున రోప్‌వేలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 చోట్ల రోప్‌వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా ఏపీకి రోప్ వే హంగులను అద్దేందుకు సిద్దమవుతున్నారు అధికారులు.
Read Also: MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్‌లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య
ఏపీలో మొత్తంగా 26 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రోప్ వేలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఎన్‌హెచ్‌ఏఐకు అనుబంధ సంస్థ అయిన నేషనల్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనే సంస్థతో ఏపీటీడీసీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే రెండు చోట్ల డీపీఆర్‌లు కూడా సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇంద్రకీలాద్రి పైకి రోప్‌వే ఏర్పాటు.. అలాగే తెలంగాణ ప్రాంతంలోని ఈగల పెంట నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నది మీదుగా రోప్ వే ఏర్పాటుకు డీపీఆర్‌లు సిద్దంగా ఉన్నాయి. ఇవి కాకుండా.. మరో ఆరు చోట్ల వీలైనంత త్వరగా డీపీఆర్‌లు సిద్దం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు అధికారులు. గండికోట, శ్రీకాళహస్తి, కటికి వాటర్ ఫాల్స్, లంబసింగి, అన్నవరం, గగన్‌మహల్-పెనుకొండ పర్యాటక ప్రదేశాల్లో రోప్ వే ఏర్పాటుకు త్వరలోనే డీపీఆర్‌లు సిద్దం కానున్నట్టు సమాచారం.
వీటిల్లో వీలైనంత త్వరగా రోప్‌వేల ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. వీలుంటే మరో మూడు నాలుగు నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రోప్‌వేల నిర్వహాణ బాధ్యతను పూర్తిగా నేషనల్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థే చేపట్టనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సదురు సంస్థే తీసుకోనున్నట్టు సమాచారం. అనుకున్న విధంగా రోప్‌వే హంగులు ఏపీకి వస్తే.. ఏపీని న్యూలుక్‌లో చూడొచ్చని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.