NTV Telugu Site icon

Kodi Pandalu: వెయ్యి కట్టు.. బైక్ పట్టు.. పందెం బరుల వద్ద కూపన్ల ఆఫర్లు

Kodi Pandelu

Kodi Pandelu

Kodi Pandalu: ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి. హైటెక్‌ అంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో కోడి పందాలు ఊపందుకున్నాయి. పందాలు చూసేందుకు తరలి వచ్చే జనం కోసం ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. నారాయణపురంలో పందెం బరి దగ్గర వెయ్యి రూపాయల కూపన్ కొంటే లాటరీలో రెండు బైకులు గెలుచుకునే ఆఫర్ ఇచ్చారు. దీంతో పందెం రాయుళ్లు పనిలోపనిగా కూపన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వాహనాలు క్యూకట్టాయి. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతల మద్దతుతో కోడి పందాలకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.

Read Also: Cyber Crime: తెలియని నంబర్‌.. సెక్సీ డీపీ.. రూ.లక్షలు కొల్లగొడుతున్న సైబర్‌ మోసగాళ్లు

సంవత్సరమంతా బలమైన ఆహారంతో మేపిన కోడి పుంజులను పందెంరాయుళ్లు బరిలో దింపుతున్నారు. కోత పందాలతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి పుంజులను ఢీకొట్టేందుకు బాదం, పిస్తా, వివిధ మెడిసన్లతో పాటు ఆర్మీ సైనికుడికి ఇచ్చిన శిక్షణ మాదిరి ఈత కొట్టించడం, ఇతర శిక్షణ ఇచ్చి కోళ్లను బరిలో దింపుతున్నారు పందెంరాయుళ్లు. ఇక బరుల వద్ద సందడి నెలకొంది. కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. కోడిపందాలతో పాటు పక్కనే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు చట్టరీత్యా నేరమైన రాజకీయ అండదండలతో ఏటా పండుగ మూడు రోజులు నిర్వహించడ ఆనవాయితీగా మారింది. సంప్రదాయంలో భాగంగా కోడి పందాలు అడుతున్నామని పందెంరాయుళ్లు వాదించడం ఇందులో కొసమెరుపు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసుల ఆంక్షలు ఉన్నా పందెం రాయుళ్లు వెనుకాడడం లేదు. కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు ఉన్నా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుండడం మామూలైంది. పెద్ద బరులకు రూ.లక్ష, ఓ మోస్తరు బరికి రూ.70 వేలు, మిగిలిన వాటికి బరుల ప్రాతిపదికన ధరలు నిర్ణయించి నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

 

Show comments