Wasim Akram and Shoaib Malik Heap Praise on Rohit Sharma: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీలు వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. రోహిత్ వారందరికంటే ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్‌ల కంటే ఎంతో ప్రత్యేకం అని పొగడ్తల్లో ముంచెత్తారు. హిట్‌మ్యాన్ ఏ బౌలర్నీ వదిలిపెట్టలేదని అక్రమ్, మాలిక్ అన్నారు. ఓ క్రీడా ఛానల్‌తో పాక్ మాజీలు మాట్లాడుతూ రోహిత్ ఆట గురించి స్పందించారు.
‘అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మరొకరు లేరు. విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్ గురించిమనం మాట్లాడతాం. కానీ వారందరికంటే హిట్‌మ్యాన్ ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి ఎవరైనా, ఎలాంటి బౌలింగ్ ఉన్నా దీటుగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు చేస్తాడు’ అని వసీమ్ అక్రమ్ అన్నాడు. ‘ప్రత్యర్థి బౌలర్లు ఐదుగురినీ రోహిత్ ఆడేస్తాడు. కోహ్లీ, రూట్, కేన్, బాబర్ లాంటి వాళ్లు 3-4 బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటే.. రోహిత్ ఐదుగురిని టార్గెట్ చేస్తాడు. హిట్‌మ్యాన్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడు’ అని మాలిక్ పేర్కొన్నాడు.
Also Read: Udupi Crime: ఆటోలో వచ్చి.. నలుగురిని హత్య చేసిన దుండగుడు!
‘జట్టుకు మంచి ఆరంభాలు ఇవ్వాలని రోహిత్ శర్మ ఎప్పుడూ ఆలోచిస్తాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి పవర్‌ప్లేను ఉపయోగించుకోవడం ఎంతో కీలకం. రోహిత్ విరుచుకుపడటంతో బౌలర్ల మైండ్ సెట్ కూడా మారిపోతుంది. అప్పుడు బౌలర్లు భయాందోళనకు గురై.. డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. ఇలానే భారత్ ప్రపంచకప్ 2023లో అద్భుతమైన ఆరంభాలను అందుకొంది’ అని షోయబ్ మాలిక్ వివరించాడు.