రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందని, హైడ్రాను బూచిగా చూపి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గం అని విమర్శించారు. పేదలు మురికి కూపంలో జీవితాలు వెల్లదీయాలని సంకుచితంగా ఆలోచించే వాళ్లే హైడ్రాను వ్యతిరేకిస్తూ దానిని ఒక బూచిగా చూపిస్తూ పేదల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
Also Read: Virender Sehwag: ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించాడు.. నేరుగా సచిన్ దగ్గరికి వెళ్లా..!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ‘కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోము. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్ పేట బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈరోజు సామాన్య ప్రజలు హైడ్రాకు పాలాభిషేకం చేస్తున్నారు. మేం అధికారం చేపట్టే నాటికి వారసత్వంగా 8 లక్షల 21 వేల 651 కోట్ల అప్పులు, బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. దీనిలో 6 లక్షల 71 వేల 757 కోట్ల అప్పులు.. ఉద్యోగుల, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40 వేల 154 కోట్లు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు లక్షా 9 వేల 740 కోట్లు. గత పాలకులు చేసిన అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటి దాకా అసలు రూపేణా లక్షా 32 వేల 498 కోట్లు, వడ్డీలకు 88 వేల 178 కోట్లు అలిసి మొత్తం 2 లక్షల 20 వేల 676 కోట్ల డేట్ సర్వీసింగ్ చేశాం’ అని సీఎం చెప్పారు.
