తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. పార్టీలోకి వచ్చిన శ్రీహరి రావుకి సాదర స్వాగతం పలుకుతున్నానని, నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందని, కొందరు పార్టీ వీడితే నాయకులే ఉందన్నట్లు వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కానీ అంతకంటే బలమైన నాయకులు పార్టీలోకి వచ్చారు. ఖచ్చితంగా నిర్మల్ అసెంబ్లీ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. కొడంగల్ లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటాం. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నా నిర్మల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆరెస్ ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో మేం ఓట్లు అడుగుతాం. ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదు.
Also Read : Amaravathi: బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వైసీపీ ప్రభుత్వం కృషి- సజ్జల
తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ చేతిలో మోసపోయినవారి జాబితాలో శ్రీహరి రావు మొదట్లో ఉంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో 10కి కనీసం 8 సీట్లు గెలిపించుకోవాలి. ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుఫాన్ రాబోతుందిజ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రతీ గుండెకు చేరాలి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఉంది. తలుపు తడితే చాలు ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోంది. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఒడిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీఆరెస్ పార్టీని బండకేసి కొడతారు. శ్రీహరి రావుకు పీసీసీ అధ్యక్షుడుగా అండగా ఉంటా.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
