NTV Telugu Site icon

Revanth Reddy : మీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యం

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని లేఖలో రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. బషీర్ బాగ్ లాంటి చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు మన కళ్ల ముందే ఉన్నాయని, బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు పేదలపై పడుతున్న భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే కేసీఆర్ పాపంలో వారు కూడా భాగస్వాములవుతారని ఆయన వ్యాఖ్యానించారు. మీ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యమని ఆయన అన్నారు. మీ కుటంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయని, మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.

Also Read : Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ జోరు

గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారని, మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లుల డిపాజిట్ పేరుతో పేదవాడి జేబుకు చిల్లులు పెట్టడానికి తయారయ్యారని ఆయన మండిపడ్డారు. ఒక వైపు కరోనా, పెట్రోల్ – డీజిల్ – గ్యాస్ ధరల పెరుగుదల, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారని, ఉపాధి కరువై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్యతరగతి వాడిపై దోపిడీకి తెగబడటం క్షయమించరాని విషయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంట్ల కరెంటు ఇస్తున్నామని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని మీరు ఊరు వాడ డప్పు కొట్టుకుంటున్నారని, అదే నిజమైతే విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళతాయని ఆయన ప్రశ్నించారు.

Also Read : Rachamallu Sivaprasad Reddy: రసపుత్ర రజనీ వైసీపీ మనిషే.. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వమే 20 వేలకోట్ల మేర బకాయి పడిన మాట వాస్తవం కాదా!? అని ఆయన అన్నారు. ఛత్తీస్‌గడ్‌ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టమన్న రేవంత్‌ రెడ్డి.. దానివల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా మీరు పెడ చెవిన పెట్టారన్నారు. యాదాద్రీ – భద్రాద్రీ లాంటి ప్లాంట్ల నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికతను వినియోగిస్తున్నారన్నారు. దాని వల్ల భారం తప్ప ప్రయోజనం లేదని గొంతు చించుకున్నా మీరు వినలేదన్నారు. మీ కమీషన్లు, మీ కుంభకోణాల కోసమే ఈ ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు అన్నది జగద్విదితమని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా లేదన్నారు.