Rachamallu Sivaprasad Reddy: దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయిన బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ విషయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి స్పందించారు. రసపుత్ర రజనీ వైఎస్ఆర్‌సీపీకి చెందిన మనిషేనని ఆయన స్పష్టం చేశారు. దొంగనోట్ల చలామణి కేసులో రజనీ బెంగళూరులో పోలీసులకు దొరికిందని తమకు సమాచారం అందిందని.. తమ కుమార్తెను బెంగుళూరులోని ఓ కాలేజీలో చేర్పించడానికి తన అన్న చరణ్ సింగ్ ఇంటికి రజనీ వెళ్లిందని.. చరణ్ సింగ్ ఇంట్లో దొంగ నోట్ల కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి చరణ్ సింగ్‌తో పాటు రజనీని అరెస్ట్ చేసినట్లు తెలిసిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.
Read Also: Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి
దొంగనోట్ల చలామణి కేసులో పూర్తిగా విచారణ చేసి రసపుత్ర రజనీ నిజంగానే తప్పు చేసినట్లు తేలితే ఆమెపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వైసీపీలో రజనీ లాంటి చిన్నమనిషి గురించి తనను కావాలనే టార్గెట్ చేయడం రాజకీయంగా చౌకబారు పని అని ఆయన ఆరోపించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు బ్రీఫ్డ్‌మీ కేసు, నకిలీ స్టాంపు కుంభకోణం కేసు, ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన రేవంత్‌రెడ్డి కేసులు ఏమయ్యాయని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో కావాలని రజనీని ఇరికించినట్లు తేలితే ఆమె తరఫున న్యాయపోరాటం చేస్తామని.. అలాకాకుండా ఆమె అబద్ధం చెప్పి ఈ నేరంలో పాల్గొని ఉంటే పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నిజాయితీగా ఉంటుందని.. నేరప్రవృత్తి కలిగిన వారిని, నేరాలకు పాల్పడే వారిని, నేరచరిత్ర ఉన్నవారిని పార్టీలో ఎంతమాత్రం కొనసాగించేది లేదన్నారు.