కొడంగల్‌లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను ఓడగొట్టారని, కాంగ్రెస్ కార్యకర్తలే లేని మల్కాజిగిరిలో గెలిపించారన్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కి నేను ఇప్పుడు మొగుడు అయ్యే పరిస్థితి వచ్చిందని, బీఆర్‌స్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ పంచాయతీ కోసమే బీఆర్‌ఎస్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీహార్ అధికారులతోనే నడిపిస్తున్నడని, కేటీఆర్ కి తెలంగాణ కవితకి ఆంధ్రప్రదేశ్ మరి హరీష్ కి ఏమి ఇస్తాడు చూడాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌కి ఎన్నికల కమిషన్ దగ్గర పత్రం కూడా పెట్టలేదని ఆయన అన్నారు. గత సంవత్సరం కేసీఆర్ కి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చినప్పటి నుండే ఈ ఆట సాగిందని ఆయన అన్నారు. అప్పటి నుండి ఆయన వాళ్ళని కలిసి వస్తున్నాడని, కాంగ్రెస్‌ని బలహీనం చేయాలని కేసీఆర్, మోడీ కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన ప్రతి చర్య నరేంద్ర మోదీ బలోపేతం చేయడానికేనని, బీజేపీ వ్యతిరేక శక్తులను బలహీనం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆయన అన్నారు.
బీజేపీని బలహీనం చేయాలంటే బీజేపీని వ్యతిరేకించే శక్తులను కూడగట్టాలని, యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శించారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్‌ను ఎందుకు కలుపుకోవడంలేదని, కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే అని ఆయన అన్నారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలని, కేసీఆర్ చర్యలన్నీ మోదీ సూచనలతో జరుగుతున్నవే అని ఆయన అన్నారు. అందుకే ఆయనపై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలేదని, ఈఎస్ఐ కుంభకోణంపై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.