TPCC President Revanth Reddy Criticized BJP and TRS Governments.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధిక వర్షాలు వరదలుగా మారిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ప్రకృతి వైపరీత్యం బీభత్సం సృష్టించిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని ఆయన తెలిపారు. నష్టంపై నివేదికలు తయారు చేయాలని, సీఎం కేసీఆర్ రాజకీయ కారణాలతో స్వార్ధం కోసం ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు మాకు సమాచారం అందిందన్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం 1400 ల కోట్ల నష్టం అంటూ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీకి వచ్చి మూడు రోజులు అయిందని, ప్రధానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారు అనుకున్నామని, ఢిల్లీలో స్వంత పార్టీ ఎంపిలకే టైమ్ ఇవ్వటం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీలో మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారని, ప్రధానితో పాటూ, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి ఇప్పటికీ అపాయింట్మెంట్ అడగలేదని ఆయన ధ్వజమెత్తారు.
మోడీ గుజరాత్‌కే ప్రధాని నా.. గుజరాత్ లో వరదలు వస్తే, వేల కోట్లు ఇస్తారు.. తెలంగాణ ను కేంద్రం ఎందుకు పట్టించుకోదు అంటూ ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, కేసీఆర్ ఎందుకు ఇళ్లు వదలడం లేదని, ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు మిగతా పక్షాల వెనుక దాక్కుని పోరాటం అని చెప్తున్నారని, ఎంపీలు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు తెలంగాణను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దాం అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, ప్రధానిపై కేసీఆర్ పోరాట కార్యాచరణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అపుడే ఢిల్లీ నుంచి కదలాలని, లేదంటే మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ప్రధానిపై మాట్లాడటం లేదని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు రేవంత్ రెడ్డి.