Rajahmundry Central Jail : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, చంద్రబాబు భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇదే సమయంలో.. అదే జైలులో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందడం సంచలనంగా మారింది.. డెంగ్యూతో రిమాండ్ ఖైదీ మృతిపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.. జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. రిమాండ్ ఖైదీ మృతితో వారి అనుమానాలు మరింత ఎక్కువైనట్టుగా తెలుస్తోంది.
ఇక, రిమాండ్ ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరణ ఇచ్చారు.. గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే యువకుడు దోపిడి కేసులో ఈనెల 6వ తేదీన రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు.. 7వ తేదీన రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఈనెల 19వ తేదీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.. కానీ, డెంగ్యూతో ఈ నెల 20వ తేదీన సాయంత్రం రిమాండ్ ఖైదీ మృతిచెందారని పేర్కొన్నారు. జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడు.. ప్లేట్ లెట్స్ లక్షా 50 వేలకు పడిపోయాయని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. జైలులో దోమల నివారణకు ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు చేపట్టాం.. ఫాగింగ్ చేయడం జరిగింది.. ఇవాళ కూడా ఫాగింగ్ చేస్తాం అని తెలిపారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్. మరోవైపు ఈ రోజు మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయాడు. డెంగ్యూ వ్యాధితో ఖైదీ చనిపోవడంతో చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై మాకూ ఆందోళన నెలకొందన్నారు.. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతకు అవసరమైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.