NTV Telugu Site icon

AP Elections 2024: అభ్యర్థుల తరపున బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు.. అన్నీ తామై..!

Ap

Ap

AP Elections 2024: తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మరీ ముఖ్యంగా అభ్యర్థుల తరపున ప్రచార బరిలోకి బంధు బలగం రంగంలోకి దిగింది. అభ్యర్థులు.. సమీప బంధువులు, దగ్గరి స్నేహితులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాలలో నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచన చేస్తూనే ఆర్థిక వ్యవహారాలకు చక్కబెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులు, ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం, వాహనాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఒక్కొక్కరు మీదేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల కుటుంబసభ్యులు, భార్యాపిల్లలు, విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయం కావడంతో అందరూ ఇంటికి చేరుకుంటున్నారు. వీరి ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ప్రచారంలో అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.. బంధువులు, స్నేహితుల రంగ ప్రవేశం.. పార్టీ నేతల్లోనూ ఉత్సాహం. నింపుతోంది.

Read Also: Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..

చిన్న చిన్న తగాదాలతో దూరమైన బంధువులు, మిత్రులతో అభ్యర్థులు సమావేశమై వీరిని ఏకం చేసి తనను సహకరించేలా చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రాంతాలవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. తమ సమీప బంధువులు, స్నేహితులకు గ్రామాలు, మండలాలు లేదా డివిజన్లవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే తేదీ, ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో సమయాభావం వల్ల అభ్యర్థి స్వయంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించలేరు కాబట్టి ప్రాంతానికి ఒకరు లేదా ఇద్దరిని తమ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వీరిని సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నారు.

Read Also: Israel strikes: రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి

అయితే..అభ్యర్థుల బంధువులు, స్నేహితులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారం కొన్ని చోట్ల బెడిసి కొడుతున్నట్లు తెలిసింది. ఎంతోకాలంగా అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం మెలిగిన తమని కాదని అభ్యర్థి తన బంధువులు, స్నేహితులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని కొంతమంది నేతలు అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. కొంతమంది బంధువులు, స్నేహితులు తమపై పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.