Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం కాశ్మీర్ అందాలను చూసేందుకు పహల్గామ్ బైసరీన్ గడ్డి మైదానాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
ఈ దాడిపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యు్న్నత సమావేశం జరుగుతోంది. మరోవైపు అమిత్ షా కాశ్మీర్‌లో భద్రతా బలగాలతో సమీక్షిస్తున్నారు. ఇంకోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్( త్రివిధ దళాల అధిపతి), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా ప్రజలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు.
Read Also: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారీ ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్‌ని సైనికంగా, దౌత్యపరంగా దెబ్బ కొట్టేందుకు భారత్ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మనదేశం నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని భారత్ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌లోని భారత్ హైకమిషన్‌ని పూర్తిగా షట్ డౌన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారత్, పాక్ మధ్య పూర్తి స్థాయిలో దౌత్య కార్యకలాపాలు నిలిచిపోతాయి.
పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల హ్యాండర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ కేంద్రంగా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పీఓకే వెంబడి ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లోనే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై భారత్ దాడి చేసే అవకాశం ఉంది. దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని ఆధారాలతో చూపించి, ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాల ముందు పాక్‌ని దోషిగా నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.