ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి గుడ్ న్యూస్. ఏకంగా ఆరుగురు విదేశీ మ్యాచ్ విన్నర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడిలు మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. ఇక జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. విషయం తెలిసిన ఆర్సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2025 వాయిదా పడకముందే గాయపడ్డాడు. ఐపీఎల్ వాయిదా అనంతరం ఆస్ట్రేలియా వెళ్లిన హేజిల్‌వుడ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో భారత్ రాడని అందరూ భావించారు. అయితే ఆర్సీబీకి హేజిల్‌వుడ్ కీలక పేసర్ కాబట్టి.. యాజమాన్యం చర్చల కారణంగా అతడిని పంపేందుకు ఆస్ట్రేలియా బోర్డు ఒప్పుకుంది. దాంతో ఐపీఎల్ సీజన్ అయిపోయే వరకు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండనున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి జట్టులో చేరాడు.
రొమారియో షెపర్డ్ ఇప్పటికే ఆర్సీబీ జట్టులో చేరాడు. ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైనా వెస్టిండీస్ బోర్డును ఒప్పించుకుని తిరిగి భారత్ వచ్చేశాడు. ఐపీఎల్ 2025 ముగిసే వరకు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడు. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీసులో ఇంగ్లాండ్ జట్టులో సాల్ట్ భాగమైనా.. జూన్ 6న మ్యాచులు ప్రారంభమవుతాయి. టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా టోర్నీ ముగిసేవరకు అందుబాటులో ఉంటారు. దాంతో ఆర్సీబీ జట్టు ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. స్వదేశీ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ, యశ్ దయాల్ కూడా మంచి ఫామ్ మీదున్నారు. ఈ ఏడాది ఆర్సీబీ తొలి టైటిల్ కల నెరవేరేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో విజయం సాధిస్తే అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.