చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం తన అదృష్టం అని భారత బౌలర్ యశ్ దయాళ్ తెలిపాడు. చివరి ఓవర్‌లో ఫోకస్ అంతా బౌలింగ్‌పైనే పెట్టానని చెప్పాడు. ధోనీ వికెట్ తీయడంలో మరే ఉద్దేశం లేదని యశ్ దయాళ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్.. చెన్నై కెప్టెన్ ధోనీని ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటి వరకు చెన్నై వైపు ఉన్న మ్యాచ్‌ను యశ్ అద్భుత బంతితో ఆర్సీబీ వైపు తిప్పాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైనప్పుడు శివమ్ దూబె సింగిల్ మాత్రమే తీయడంతో ఆర్సీబీ విజయం సాధించింది.
బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాళ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024, ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం కెరీర్‌లో అదృష్టంగా భావిస్తా అని చెప్పాడు. ‘బెంగళూరు విజయానికి చివరి ఓవర్ చాలా కీలకం. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా.. తర్వాత బంతిని ఎలా సంధించాలన్న దానిపైనే దృష్టి పెట్టాను. ఇంతకు ముందు నేను ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేశాను. నేను బాగా బౌలింగ్ చేయగలనని బలంగా నమ్మా. గతేడాదికి, ఇప్పటికి తేడా పెద్దగా లేదు. పిచ్‌లో ఎలాంటి మార్పు లేదు’ అని యశ్ దయాళ్ చెప్పాడు.
Also Read: Punjab Kings: మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్.. పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!
‘ఎంఎస్ ధోనీ అప్పుడు క్యాచ్ ఔట్ కాగా.. ఈసారి ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. నాకు వికెట్ తీయాలనే ఉద్దేశ్యం లేదు. జట్టు గెలుపే మాకు ముఖ్యం. ధోనీని ఔట్ చేయడం నా కెరీర్‌లో అదృష్టంగా భావిస్తా. చివరి బంతికి నాలుగు రన్స్ అవసరమైనప్పుడు శివమ్ దూబె సింగిల్ మాత్రమే తీశాడు. అప్పటికీ ఆర్సీబీ చెలిచిందని నేను అనుకోలేదు. నాకు దగ్గరలో ఉన్న బెతెల్‌ను బంతి విసరమని చెప్పా. మ్యాచ్ ముగిసేవరకూ సంబరాలు చేసుకోలేదు. విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని యశ్ దయాళ్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో బెంగళూరు దాదాపుగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే.