RBI Repo Rate 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన.
Also Read: Apple Layoff 2024: యాపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత!
రెపో రేటు యథాతథంగా ఉంచేందుకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఆర్థికవృద్ధి గాడిలో పడిందని, అన్ని అంచనాలను దాటి వేస్తున్నామన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. రెండు నెలల్లో 5.1 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పుకొచ్చారు.
2023 ఫిబ్రవరి సమీక్షలో చివరిసారిగా రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది. అప్పటినుంచి ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సమీక్షల్ని నిర్వహిస్తున్న ఆర్‌బీఐ.. ఈ రేట్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఏడాదికి పైగా రెపో రేటు స్థిరంగా ఉంటుంది.