Rampur Court issued seventh arrest warrant against Jaya Prada: మాజీ ఎంపీ, నటి జయప్రదను వెంటనే అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల (ఎంపీ/ఎమ్మెల్యే) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రదను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈనెల 27న హాజరు పరచాలని రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ఆమె పలుమార్లు కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదు కాగా.. వాటి విచారణకు ఆమె హాజరు కాలేదు.
నటి జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణలో భాగంగా అనేక సార్లు కోర్టు నోటీసులు జారీ చేసినా.. జయప్రద స్పందించలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయబడిన ప్రతిసారీ ఆమె హాజరుకాలేదు.
Also Read: Ishan Kishan: బీసీసీఐ వార్నింగ్.. వెనక్కితగ్గిన ఇషాన్ కిషన్!
మంగళవారం కూడా మాజీ ఎంపీ జయప్రద కోర్టుకు రాలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో రెండు కేసులకు సంబంధించి మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. జయప్రదను అరెస్టు చేయాలని రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.