కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) అధినేత జయంత్ చౌధరి రాజ్యసభలో మాట్లాడుతుండగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ (Charan Singh)కి కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఈ సందర్భంగా తన తాతను పురస్కారంతో గౌరవించిన కేంద్రానికి జయంత్ చౌధరి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆయన మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుపడ్డారు. భారతరత్నతో నాయకులను సత్కరించడంపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని ఖర్గే అడ్డుకున్నారు. అయినా సభలో సభ్యుడు ఒక అంశంపై మాట్లాడాలనుకుంటే.. దానికంటే ముందు ఏ నియమం ప్రకారం మాట్లాడాలనుకుంటున్నారోనని ఛైర్మన్ అడుగుతారన్నారు. కానీ ఇప్పుడు జయంత్ మాట్లాడేందుకు ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో తెలుసుకోవాలనుకుంటున్నానని ఖర్గే నిలదీశారు.. అలాంటి అనుమతి ఉంటే తమకు ఇవ్వాలని.. మేమూ వినియోగించుకుంటామని ఖర్గే కోరారు. రూల్స్ అనేవి న్యాయబద్ధంగా ఉండాలని.. మీకు నచ్చినట్లు అమలు చేయడం సరికాదంటూ ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలపై జగదీప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
చరణ్‌సింగ్‌ను ఖర్గే అవమానించారని.. ఆయన వారసత్వాన్ని కూడా అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఆయన్ను అవమానిస్తే సహించబోమని చెప్పారు. సభలో ఇలాంటి భాషను వినియోగించడం ఆమోదయోగ్యం కాదని ఛైర్మన్ హెచ్చరించారు.