సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే కాదు, దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత పెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ‘పడయప్ప’ (నరసింహ) మూవీ ఒకటి. 1999లో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ నటన ఒక ఎత్తు అయితే, రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి అనే విలన్ పాత్ర సృష్టించిన ప్రభంజనం మరో ఎత్తు. ఇప్పుడు, ఈ క్లాసిక్ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ డిసెంబర్ 12న మళ్లీ థియేటర్లలోకి రీ-రిలీజ్ కాబోతోంది. ఈ రీ-రిలీజ్ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తమిళ సినీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. అదేంటంటే,
Also Read : Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్.. ఎంట్రీ సాంగ్‌తోనే బాక్సాఫీస్ షేక్?
‘పడయప్ప 2’ (నరసింహ 2) ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నామని ఆయన ఊహించని విధంగా చెప్పారు! మరింత ఆశ్చర్యకరంగా, ఈ సీక్వెల్ మొత్తం రమ్యకృష్ణ చేసిన ఐకానిక్ నీలాంబరి పాత్రపైనే కేంద్రీకృతమై ఉంటుందని కూడా వెల్లడించారు. దీంతో రజనీకాంత్ ప్రకటన అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నింపిన, కథనం ఏంటి? పాత సినిమాలో నీలాంబరి చనిపోతుంది, మరి ఈ సీక్వెల్‌లో ఆమె పాత్రను ఎలా తిరిగి తీసుకొస్తారు? ఇది ఫ్లాష్‌బ్యాక్ కథ అవుతుందా? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే
‘పడయప్ప’ను తీసిన కె.ఎస్. రవికుమార్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అలాంటి క్లాసిక్ సీక్వెల్‌ను హ్యాండిల్ చేయగల సరైన దర్శకుడిని సెలక్ట్ చేయడం కష్టమే. కాగా ఈ ప్రకటన కేవలం రీ-రిలీజ్ చుట్టూ మరింత హైప్‌ను పెంచడానికి చేసిన ప్లాన్‌గా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ‘పడయప్ప’ సినిమా ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. అందుకే ఈ క్లాసిక్ సినిమాను మళ్లీ థియేటర్లలో చూడాలని అభిమానులు ఉబలాటపడుతున్నారు. రజనీకాంత్ ఈ ప్రకటన వెనుక కారణం ఏమైనప్పటికీ, డిసెంబర్ 12న థియేటర్లలో మాత్రం పెద్ద పండుగ జరగడం ఖాయం.