NTV Telugu Site icon

Ashok Gehlot: మణిపూర్‌ పర్యటనకు మోడీ ఎందుకు దూరంగా ఉంటున్నారు?

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot vs Modi: ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేసిన మోడీ.. మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉందని.. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆయన ఏం మాట్లాడుతారో ఒక్కసారి ఊహించుకోవాలని విమర్శలు గుప్పించారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు వెలుగుచూసిన వీడియోపై మోడీ ఇటీవల వ్యాఖ్యానిస్తూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన సంఘటనలను ప్రధాని మోడీ ప్రస్తావించారని, మోడీ వ్యాఖ్యలు రాజస్థాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని అశోక్‌ గెహ్లాట్ అన్నారు. మణిపూర్‌‌లో ప్రధాని మోడీ పర్యటించలేకపోతే కనీసం ఒక సమావేశమైనా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.

Also Read: Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే ఔదార్యం.. అనాథ పిల్లలను దత్తత తీసుకోనున్న సీఎం

మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులను ప్రధాని నరేంద్ర మోడీ గత గురువారం నాడు వ్యాఖ్యానిస్తూ, సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని అన్నారు. ”ఎవరు దీనికి బాధ్యులనేది పక్కనపెడితే ఇలాంటి ఘటనలు దేశానికి తలవంపులు తెస్తాయి. శాంతి భద్రతలను పటిష్టం చేయాలని సీఎంలందరికీ నేను కోరుతున్నారు. అది రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్‌గఢ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు. రాజకీయాలకు అతీతంగా మహిళలను గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుంది” అని అన్నారు.

Also Read: Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..

ఇదిలా ఉండగా.. మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే విమర్శించిన రాష్ట్ర మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించారు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌. గంటల వ్యవధిలో మంత్రిపై వేటువేయడం గమనార్హం. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కేబినెట్‌లో సైనిక్‌ కల్యాణ్‌ (స్వతంత్ర బాధ్యత), హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా రాజేంద్ర గుడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో రాజస్థాన్‌ కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిల్లుపై చర్చకు అంతరాయం ఏర్పడింది.

అసెంబ్లీలో మంత్రి రాజేంద్ర గుడా ప్రసంగించారు. రాజస్థాన్‌లో మన తల్లులు, సోదరీమణులపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి, తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఉదయ్ పూర్వతిలోని మహిళలకు తాను రక్షణ కల్పిస్తాని నమ్మి ఎన్నికల్లో గెలిపించారు.. కానీ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నాలుగు నెలల్లో జరుగునున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సొంత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రిని పదవి నుంచి తొలగించారు.