ఇవాళ రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్‌లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ తదుపరి సీఎం పేరును ప్రకటించనున్నారు. ఇక, బీజేపీ హైకమాండ్ పంపిన కేంద్ర పరిశీలకుడు శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేల ప్రాధాన్యతలను అడిగి తెలుసుకుని హైకమాండ్ పంపించనున్నారు. ఆ తర్వాత సీఎం పదవికి ఏకగ్రీవంగా పేరు ప్రకటిస్తారు. కేంద్ర పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను కమలం పార్టీ నియమించింది. ఇప్పుడు ఈ ముగ్గురు పరిశీలకులు రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒక పేరుపై ఏకాభిప్రాయానికి రానున్నారు.
Read Also: Costly Coffee : ఈ కాఫీకి ఫుల్ డిమాండ్ .. ధర ఎంతో తెలుసా?
అయితే, రాజస్థాన్ సీఎం రేసులో బాబా బాలకనాథ్, వసుంధర రాజే, జైపూర్ రాజకుటుంబ యువరాణి దియా కుమారి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఎవరికి సీఎం పదవి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, తిజారా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా బాల్కనాథ్ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇప్పటికే సమావేశమయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లతో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రాగా, కాంగ్రెస్ 69 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది. ఇక, సీఎం పదవి కోసం రేసులో మాజీ సీఎం వసుంధర రాజే ఇటీవల తన నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించడం ద్వారా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌లో సీఎం పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.