9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ జైపుర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు. ఝలావర్‌లోని పోలింగ్ బూత్‌లో బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా జోధ్‌పుర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కేంద్ర మంత్రి కైలాశ్ చౌధరీ, బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా, బీజేపీ ఎంపీ దియా కుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్ జరుగుతోంది. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్ వాయిదా పడింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాజస్థాన్‌లో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించగా.. కాంగ్రెస్ పార్టీ భరత్‌పూర్ స్థానాన్ని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ)కి కేటాయించింది.
రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం, ఆర్‌ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడంతో కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది.
#RajasthanElections2023#SachinPilot pic.twitter.com/4FuUZSI6Mu
— Ravi Sisodia ರವಿ (@ravi27kant) November 25, 2023