Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : మా ప్రభుత్వం వచ్చాక కార్మికుల సంక్షేమంలో రాజీలేదు

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చే పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇలాంటి ధార్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాగ్దానాలు చేసి కూడా ఒక్క రూపాయి కూడా ఆలయానికి మంజూరు చేయలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రకటనలూ లేకుండానే బడ్జెట్ లో నేరుగా వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిందని తెలిపారు.

పరిశ్రమల పరిరక్షణపై మంత్రి ఘాటుగా స్పందిస్తూ, పరిశ్రమల ఆధారంగా జీవనం సాగించే కార్మికులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, రాజీలేని విధంగా ఆ దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

విద్యా రంగంపై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యారంగం మునుపటి గొప్పతనాన్ని కోల్పోయిందని అన్నారు. అయితే శాతవాహన విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుందని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, అపనిందలు, తప్పుడు ప్రచారాలు చేయడం వారికి అలవాటైపోయిందని మంత్రి ఆరోపించారు. హైద్రాబాద్ యూనివర్సిటీ భూముల విషయాన్ని ప్రస్తావిస్తూ, నగర మధ్యలో ఏనుగులు తిరుగుతాయా అంటూ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో భ్రమలు సృష్టించారని పేర్కొన్నారు.

త‌మ ప్రభుత్వ ధ్యేయాలు చాలా స్పష్టంగా ఉన్నాయనీ, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, నేతన్న సంక్షేమం, ధార్మిక క్షేత్రాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రీకరించి పాలన సాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన సాగిస్తున్నామని తెలిపారు.

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్‌ల పాత్ర..

Exit mobile version