Rahul Gandhi: బీహార్‌లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు. సామాజిక న్యాయంపై ప్రజల దృష్టి మరలడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ అన్నారు. అందుకే నితీష్‌కి బీజేపీ ఒక మార్గాన్ని అందించింది. నితీష్ జీ ఆ బాటలో పయనించారు. నితీష్ జీ ఇక్కడ ఇరుక్కుపోయారని రాహుల్ గాందీ వెల్లడించారు.
Read Also: Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
“నితీష్ జీ ఎందుకు ఇరుక్కుపోయాడో అర్థం చేసుకోండి. మీరు బీహార్‌లో కుల గణన నిర్వహించాలి అని నేను ఆయనకు సూటిగా చెప్పాను. మేము కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ జీని సర్వే చేయమని పట్టుబట్టాము. ఈ విషయంలో బీజేపీ భయపడింది. బీహార్‌లో కులగణన జరపాలని బీజేపీ కోరుకోలేదు. ఎందుకంటే వారు దేశానికి నిజం చెప్పడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే నితీష్‌పై వచ్చిన ఒత్తిడి కారణంగానే ఎన్డీయేలో చేరారు.” అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగించారు. మీకు సామాజిక న్యాయం కల్పించడం ఇండియా కూటమి బాధ్యత అని, దీనికి నితీష్ కుమార్ మాకు అవసరం లేదని రాహుల్ గాంధీ బీహార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
Read Also: Rajyasabha: నితీష్-అజిత్ పవార్ రాకతో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి. విజయ్ సిన్హా ఆయన డిప్యూటీలుగా ఉన్నారు. అంతా సరిగ్గా లేనందునే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తలెత్తాయని నితీష్ కుమార్ అన్నారు.