Rahul Gandhi on INDIA Alliance PM Candidate: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పీ చిదంబరం తదితరులు ‘న్యాయ్ పత్ర’ పేరుతో శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టో రిలీజ్ అనంతరం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొనగా.. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన స్పందించారు.
‘ఇండియా కూటమి సైద్ధాంతిక ఎన్నికల్లో పోరాడుతోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఎన్నికల్లో మేము గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే.
Also Read: Shashank Singh: ఇది తెలుసా.. శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడిన ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు!
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి.. వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారికి మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తాం. మీడియా అంచనాలకు అందని విధంగా ఈసారి ఎన్నికల్లో నువ్వానేనా అనేలా పోటీ ఉంటుంది. బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయి’ అని రాహుల్ ఆరోపించారు.