Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాహుల్‌కు పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతోకూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ.. పరువు నష్టం దావా వేసిన గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ అసలు ఇంటిపేరు ‘మోడీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.