US Bomb Cyclone: మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. రోడ్డుపై మంచుపేరుకుపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ మంచు తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి శీతల గాలుల వల్ల, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 30 మందిని మంచు తుఫాను బలి తీసుకుంది.
అక్కడ ఉష్ణోగ్రత చాలా ప్రాంతాల్లో మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని మంచు, చలిని అమెరికన్లు చూస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో 40 శాతం జనాభా అనగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల వల్ల తొమ్మిది రాష్ట్రాల్లో విస్తృతంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో 15 లక్షల మంది విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా 16 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులను మూసివేశారు. చాలా రోడ్లు బ్లాక్ అయ్యాయి. న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భీకరమైన మంచు తుఫాను, శీతల గాలులు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వల్ల ఇటీవలి రోజుల్లో 15,000 కంటే ఎక్కువ యూఎస్ విమానాలను అధికారులు రద్దు చేశారు. న్యూయార్క్‌లో తెలుగు దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం.
Road Accident: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కారుకు ప్రమాదం
అమెరికాలో 10 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. వీటిలో మాంటెన్నా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిన్నెసొటా, అయోవా, ఇండియానా, మిచిగాన్, నెబ్రాస్కా, విస్కాన్సిన్, న్యూయార్క్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని స్పైడర్‌లో 56 అంగుళాల మేర మంచు కురిసింది. మిచిగాన్లోని బరగాలో 46 అంగుళాలు, న్యూయార్క్‌లోని వాటర్‌టౌన్‌లో 36 అంగుళాల మంచు కురిసింది. 1977లో సంభవించిన మంచు తుఫాను కంటే ప్రస్తుత తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ తెలిపారు. ఆ సమయంలో 30 మంది మరణించారని అన్నారు. తాజా తుఫాను వల్ల మరెన్నో మరణాలు ఉంటాయని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.
బాంబ్ సైక్లోన్ అంటే..
చాలా వేగంగా తుఫాన్‌గా మారే దానిని బాంబ్ సైక్లోన్‌గా అభివర్ణిస్తారు. వాతావరణంలో చల్లటి గాలి, వెచ్చటి గాలి కలగలిసిన సమయంలో ఇది ఏర్పడుతుంది. వెచ్చటిగాలి పైకి ఎగసి తక్కువ పీడనం ఏర్పడుతుంది. వాతావరణంలోని తేమ కారణంగా తుఫాన్ మేఘాలు ఏర్పడుతాయి. వాతావరణంలో గాలి పీడనం 24 గంటల్లో 24 మిల్లీ బార్లు పడిపోవడం వల్ల కూడా బాంబ్ సైక్లోన్ ఏర్పడుతుంది. భూభ్రమణ ప్రభావం కూడా దీనితో కలిసి పరిస్థితి తీవ్రంగా మారుతుంది.