ఏపీలో ఇప్పుడు ‘బోసడీకే’ అనే పదం చుట్టూ రాజకీయం అలుముకుంది. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను బోసడీకే అంటూ సంభోదించారు. ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే బోసడీకే అనే పదం పెద్ద తిట్టు అని వైసీపీ నేతలు అంటుండగా.. ఈ పదానికి అర్థం ఏంటని పలువురు గూగుల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి బోసడీకే అనే పదం ఏపీని అతలాకుతలం చేస్తోందన్నారు. టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన దానికి ఇది రియాక్షన్ అని పలువురు అంటున్నారని.. అయితే పట్టాభి ఏం మాట్లాడారో తాను కూడా విన్నానని రఘురామ తెలిపారు. పట్టాభి బోసడీకే అనే పదం వాడారని.. ఈ పదానికి అర్థమేంటో తాను 20, 25 మంది స్నేహితులను అడిగానన్నారు. వైసీపీలోని తన అజ్ఞాత మిత్రులను కూడా అడిగానని.. కానీ వారు తమకు తెలియదని.. అదో బూతుపదమని చెప్పారన్నారు. తాను బోసడీకే అనే పదం గురించి గూగుల్ చేయగా.. అందులో స్పష్టంగా తెలిసిందేంటంటే.. బోసడీకే అంటే సంస్కృతంలో ‘సర్… మీరు బాగున్నారా’ అని అర్థమని రఘురామ వివరించారు. కాగా పట్టాభి చేత బోసడీకే అని చంద్రబాబే మాట్లాడించారని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బోసడీకే అంటే తెలుగులో పెద్ద బూతు అని, అందుకే వైసీపీ కార్యకర్తలు వెంటనే రియాక్షన్ చూపించారని అభిప్రాయపడుతున్నారు.