దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 12-13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్‌లో సభ్య దేశాధినేతలు హస్తినకు రాబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాబోతున్నారు. అయితే బ్రిక్స్ సమావేశాలకు ముందుగానే పుతిన్ ఢిల్లీకి వచ్చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీకి రాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు.. పాశ్చాత్య ఆంక్షలు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
భారతదేశాన్ని రష్యాకు ‘‘వ్యూహాత్మక భాగస్వామి’’గా అభివర్ణిస్తూ.. శుక్రవారం ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగబోతున్నట్లుగా క్రెమ్లిన్ ధృవీకరించింది. రష్యా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి క్రెమ్లిన్ అధికార ప్రతినిధి, పుతిన్ ప్రెస్ సెక్రటరీ అయిన డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలు భారత్-రష్యా సంబంధాలలోని సౌహార్దాన్ని, అలాగే మారుతున్న ప్రపంచ క్రమాన్ని ప్రతిబింబించాయి.
‘‘రెండు దేశాల మధ్య పరస్పర సంప్రదింపులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో జరిగే సమావేశం. మీకు తెలిసినట్లుగా భారతదేశం-రష్యా నాయకుల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి సంబంధం చాలా ఆచరణాత్మకమైనది. వారు ఒకరితో ఒకరు ఎంత నిజాయితీగా ఉంటారంటే.. ప్రపంచ ఎజెండా, మన పరస్పర సంబంధాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమస్యలను కూడా వారు చాలా బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించగలరు.’’ అని పెస్కోవ్ అన్నారు.
బ్రిక్స్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ పెస్కోవ్ ఇలా అన్నారు. ‘‘బ్రిక్స్ ఒక సంస్థ కాదు. అది ఒక కూటమి అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మాకు శాసనం, నియమాలు లేదా శాశ్వత కార్యాలయం లేవు. దానికి బదులుగా ప్రపంచంలో పనులు ఎలా జరగాలి. వివిధ రంగాలలో సహకారం ఎలా కొనసాగించాలి అనే దానిపై ఉమ్మడి దృక్పథాన్ని పంచుకునే దేశాల కూటమి ఇది.’’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ-అధ్యక్షుడు పుతిన్ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు కూడా కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సంప్రదింపులు, దౌత్యం అవసరమని భారతదేశం మొదటి నుంచి నొక్కి చెబుతోంది. ఈ విషయంలో భారతదేశ పాత్ర గురించి అడగ్గా ‘‘భారత ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాము.’’ అని పెస్కోవ్ అన్నారు.

