Public protests against the government in Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు అక్కడి ప్రజలు. అమెరికా రాయబారి డోనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పర్యటన ద్వారా మైలేజ్ పొందాలని భావిస్తున్న పాకిస్తాన్ కు షాక్ ఇస్తున్నారు ప్రజలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని స్వాత్ లోయలో ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. షెహజాబ్ షరీఫ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం విఫలం అయితే ఆయుధాలు చేతపట్టాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
స్వాత్ లోయలోని ఖ్వాజఖేలా మట్టా చౌక్ లో స్వాత్ ఒలాసి ససూన్, స్వాత్ ఖ్వామీ బిర్గా భారీ సమావేశానికి పిలుపునిచ్చింది. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పాకిస్తాన్ లో అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ ఇటీవల పీఓకేను సందర్శించి.. దాన్ని ఆజాద్ కాశ్మీర్ గా పేర్కొన్నారు. మళ్లీ పాకిస్తాన్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని దాయాది దేశం భావిస్తోంది. ఇలాంటి సమయంలోనే తాజా నిరసనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి ఇబ్బందికరంగా మారాయి.
Read Also: Son Attacked Parents: స్టాక్ మార్కెట్ లో లక్షల్లో లాస్.. డబ్బుకోసం తల్లిదండ్రులను దారుణ హత్య
స్వాత్ లోయలో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వాత్ లోయలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ తీసేసి విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సెప్టెంబర్ లో పాకిస్తాన్ లో మొత్తం 42 తీవ్రవాద దాడులు జరిగాయి. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులకు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ప్రభుత్వంతో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థకు చర్చలు నిలిచిపోవడంతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. 2022 మొదటి ఆరు నెలల్లో భద్రతా దళాలపై మొత్తం 434 ఉగ్రవాద దాడులు జరిగాయి. 323 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.