Dog Meat Eating Remark: అస్సాం ప్రజలు కుక్క మాంసం తినే అలవాట్లపై మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో శుక్రవారం అస్సాం అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ప్రతిపక్ష శాసనసభ్యులు గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రసంగానికి అంతరాయం కలిగించి అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేచి నిలబడి నినాదాలు చేయడంతో పాటు ఆ శాసనసభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ డిమాండ్ చేశారు. దీంతో గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తన ప్రసంగాన్ని 15 నిమిషాలకు కుదించవలసి వచ్చింద. ఈశాన్య రాష్ట్రంలోని స్థానికులు వాటిని తినేస్తున్నందున, వాటి పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి వీధికుక్కలను అస్సాంకు పంపాలని ఎమ్మెల్యే బచ్చు కడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించారు.
ఈ అంశాన్ని మొదట కాంగ్రెస్ శాసనసభ్యుడు కమలాఖ్య డే పుర్కయస్తా లేవనెత్తారు. ఎమ్మెల్యే కడుపై అస్సాం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకుడు పవన్ ఖేరాను అరెస్టు చేయడానికి రాష్ట్రానికి చెందిన పోలీసు బృందం ఇటీవల న్యూఢిల్లీకి చేరుకుందని.. కానీ మహారాష్ట్ర ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Read Also: PM Narendra Modi: ఆస్ట్రేలియా ప్రధానితో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన మోదీ..
ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే రఫీకుల్ ఇస్లాం స్పీకర్ బిస్వజిత్ డైమరీని కడు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సుమోటోగా విచారణకు తీసుకోవాలని, అస్సాం అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పమని”కోరారు. స్వతంత్ర శాసనసభ్యుడు అఖిల్ గొగోయ్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మనోరంజన్ తాలూక్దార్ కూడా తమ మహారాష్ట్ర కౌంటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష శాసనసభ్యులతో కలిసిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్ ఆఫ్ హౌస్‌లోకి వెళ్లడంతో, డైమరీ వారిని తమ స్థానాల్లోకి తిరిగి రావాలని, సరైన మార్గాల ద్వారా విషయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ గందరగోళం మధ్య విపక్ష ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేశారు.