రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీల (Priyanka gandhi) పోటీపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. ఈసారి ప్రియాంకగాంధీ పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయమైంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది. వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారని తొలుత వార్తలు వినిపించాయి. ప్రధాని మోడీపై పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే రాహుల్‌గాంధీ కూడా వయనాడ్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రియాంకగాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ (Raebareli) నుంచి పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే రాహుల్‌గాంధీ కూడా అమేథీ (Amethi) నుంచే పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. కానీ కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలుపొందారు. అయితే రాహుల్ ఈసారి వయనాడ్ నుంచి కాకుండా తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచే పోటీ చేయనున్నారని ఈ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇక ప్రియాంకగాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ నియోజకర్గం తన నాయనమ్మ దగ్గర నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు, తల్లి సోనియా ఐదు సార్లు గెలుపొందారు. అయితే ఆరోగ్యరీత్యా సోనియా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేయాలంటూ తాజాగా పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. ఆమెకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రియాంక రాయ్‌బరేలీ నుంచే పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఇక రాహుల్ కూడా అమేథీ నుంచే పోటీ చేయనున్నారు. మొత్తానికి సోదరుడు, సోదరీ ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్, ప్రియాంకను రాష్ట్ర సర్కార్ కోరుతోంది. ఖమ్మం లేదా భువనగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ వారిద్దరు కూడా యూపీ నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. 2019 ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో ఓటమి పాలైన దినేష్ ప్రతాప్ సింగ్‌నే రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. మరోవైపు అమేథీ సీటు కూడా మళ్లీ స్మృతి ఇరానీకే ఇస్తారని సమాచారం.