ఐపీఎల్ ఆరంభానికి ముందే రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ధ్రువీకరించింది. గాయం కారణంగా ప్రసిధ్ ఈసారి ఐపీఎల్ ఆడబోవడం లేదని తెలిపింది. “ప్రసిధ్ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సిన ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ.. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య బృందం తెలిపింది. దురదృష్టవశాత్తూ ప్రసిధ్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు” అని రాజస్తాన్ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రసిధ్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేయగల పేసర్ కోసం తాము అన్వేషిస్తున్నామన్న మేనేజ్‌మెంట్.. త్వరలోనే ఈ యువ బౌలర్ కోలుకోవాలని ఆకాంక్షించింది.
Also Read: IPL 2023: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది
కాగా గత సీజన్‌లో ప్రసిధ్ కృష్ణను రాజస్తాన్ రాయల్స్ రూ.10 కోట్లతో జట్టులోకి తీసుకుంది. ఇదే సీజన్‌లో జట్టు తరఫున మొత్తంగా 19 వికెట్లు( 8.28 ఎకానమీ) పడగొట్టి సత్తా చాటాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌కు అతడు దూరం కావడంతో రాజస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. జింబాబ్వేతో 2022లో హరారేలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఖరిసారిగా ప్రసిధ్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇంకా కోలుకోలేదు.
Be back soon, Skiddy. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) February 17, 2023