క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్. అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. కరోనా కారణంగా గతేడాది కేవలం ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో మాత్రమే లీగ్ నిర్వహించగా.. ఈసారి ప్రతి టీమ్ సొంత మైదానంలో మ్యాచ్‌లు జరగనున్నాయని బీసీసీఐ తెలిపింది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గతేడాది విజేత గుజరాత్ టైటాన్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఏప్రిల్ 1న మొహాలీలో పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాతి రోజున ఏప్రిల్ 2న హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్, బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య మరో డబుల్ హెడర్ జరగనుంది.
రాజస్తాన్, పంజాబ్ జట్లు ఈసారి రెండు వేదికల్లో ఆడనున్నాయి. సొంత మైదానంలో జరిగే ఏడు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్ని గుహవతి వేదికగా ఆడనుంది రాజస్తాన్. ఆపై మిగిలిన ఐదు మ్యాచ్‌ల్ని జైపూర్‌లో ఆడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ మొదటి ఐదు మ్యాచ్‌ల్ని మొహాలీలో చివరి రెండు మ్యాచ్‌ల్ని ధర్మశాలలో ఆడబోతుంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికల్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.
ఈ సీజన్‌లో భాగంగా మొత్తం 12 వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు (18 డబుల్ హెడర్స్) 52 రోజుల పాటు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మొత్తం 10 టీమ్స్ తన సొంత మైదానంలో ఏడు మ్యా్‌చ్‌లు, ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడతాయి. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్ ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇందులో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు విజేతగా నిలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ 4, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2,హైదరాబాద్ 2 (దక్కన్ ఛార్జర్స్ 1, సన్‌రైజర్స్ 1), రాజస్తాన్, గుజరాత్ ఒక్కోసారి ట్రోఫీని అందుకున్నాయి.
ఫార్మాట్ ఇదే..
ఈసారి కూడా మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై, కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉండగా.. గ్రూబ్-బీలో చెన్నై, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్ ఉన్నాయి. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. తమ గ్రూపులోని మిగిలిన నాలుగు జట్లతో 4 మ్యాచ్‌లతో పాటు ఎదుటి టీమ్‌లోని ఐదు జట్లతో 10 మ్యాచ్‌లు ఆడబోతుంది.
🚨 NEWS 🚨: BCCI announces schedule for TATA IPL 2023. #TATAIPL
Find All The Details 🔽https://t.co/hxk1gGZd8I
— IndianPremierLeague (@IPL) February 17, 2023