Prasanth Kishore: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ లో నేటి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్ జిల్లా నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. పట్నాలో ప్రత్యేక పూజల అనంతరం తన యాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుతం బిహార్‌లో సాగనున్న ఈ పాదయాత్ర.. దేశంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించనున్నారని, సుమారు12 నుంచి 18 నెలల పాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వా నుంచి ఆయన తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ యాత్ర సన్నాహంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడానికి ఈ పాదయాత్ర ముందస్తు కసరత్తు అని విశ్లేషకులు చెబుతున్నా.. పీకే మాత్రం ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తర్వాతి అడుగులు ఉంటాయని అంటున్నారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని పీకే చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల మీదుగా తన పాదయాత్ర కొనసాగిస్తానంటూ ట్వీట్ చేశారు. పాదయాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి బ్రేక్ లేకుండా యాత్రను కొనసాగించేలా ప్రణాళికలు రచించినట్లు పార్టీ తెలిపింది. ఈ యాత్రను ముఖ్యంగా మూడు లక్ష్యాలతో చేపడుతున్నట్లు పార్టీ తెలిపింది. అందులో క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించటం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావటం, వివిధ రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి ఉన్నాయి.
అయితే కొన్ని నెలల క్రితం ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. 2024 లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే పీకేను పార్టీలో చేరుకుంటున్నట్లు వాదనలు వినిపించాయి. అందుకు బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో విస్తృత చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో భేటీ అయ్యారు. దాంతో కాంగ్రెస్లో చేరటం ఖాయం అనుకున్నారు అంతా. అయితే.. ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలంటే ఆయన మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని షరతు విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో హస్తం పార్టీకి షాకిచ్చారు పీకే. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.