అమేథీ లోక్‌సభ టికెట్‌పై కాంగ్రెస్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ టికెట్‌పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాబర్ట్ వాద్రా కూడా గత వారం ఒక ప్రకటన చేశారు. అమేథీ నుంచే పోటీ చేయనున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. కాంగ్రెస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అమేథీ టికెట్ రాబర్ట్ వాద్రాకు ఇవ్వొద్దని ప్రశాంత్ భూషణ్ వార్నింగ్ ఇచ్చారు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే అది ఆత్మహత్యా సదృశ్యమని ప్రశాంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలాంటివి. అలాంటిది గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గట్టెక్కారు కానీ.. అమేథీలో మాత్రం రాహుల్‌గాంధీ ఓడిపోయారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్లతో రాహుల్ ఓడిపోయారు. కేరళలోని వాయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గట్టెక్కారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి దూరం జరిగినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వాయనాడ్ పోలింగ్ ముగిశాక.. అమేథీపై రాహుల్ నిర్ణయం తీసుకుంటారని మరో వాదన వినిపిస్తోంది.
ఇదంతా ఒకెత్తు అయితే.. అమేథీ సీటుపై రాబర్ట్ వాద్రా కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమేథీ నుంచి బీజేపీ తరపున స్మృతి ఇరానీ పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమెపై సరైన అభ్యర్థిని నిలబెట్టాలంటే రాబర్ట్ వాద్రానే కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు అమేథీ టికెట్ రాబర్ట్ వాద్రాకు ఇవ్వకూడదని ప్రశాంత్ భూషణ్ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇక సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మే 20న అమేథీ, రాయ్‌బరేలీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.