Central Election Commission on DSC Exam: ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ పరీక్ష ఫలితాలకు ఎన్నికలు అడ్డుపడ్డాయి. ఓ వైపు టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. మరో వైపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ 2024 పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ అధికారికంగా స్పష్టం చేసేంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
Read Also: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ఏపీ విద్యాశాఖ కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షల నిమిత్తం ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. వీటితోపాటు సెంటర్ల ఎంపిక ఆప్షన్లను కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల కోడ్ కారణంతోనే వీటికి కూడా బ్రేక్ పడింది. ఏ పనులైనా కేవలం ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తేనే తాము ముందుకు వెళ్లగలమని విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలంటూ వేయికి పైగా ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
