UEFA Nations League 2025: నేషన్స్ లీగ్ యూరోపియన్ దేశాల జాతీయ ఫుట్‌బాల్ జట్ల మధ్య నిర్వహించబడే UEFA ఆధ్వర్యంలోని టోర్నమెంట్. మొదటిసారి ఇది 2018-19లో ప్రారంభమైంది. టోర్నమెంట్ ఉద్దేశ్యం స్నేహపూర్వక మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయంగా అధిక స్థాయిలో పోటీ ప్రదర్శనను తీసుకురావడమే. తొలి సీజన్‌లోనూ పోర్చుగల్‌నే విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసే యూరోపియన్ నేషన్స్ లీగ్ టోర్నమెంట్ విజేతగా మళ్లీ పోర్చుగల్ నిలిచింది. జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు భీకర ఆటతీరుతో స్పెయిన్ ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పోర్చుగల్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌తో ఆడింది. మ్యాచ్ తొలి భాగంలోనే రెండు జట్లు చెరో గోల్ సాధించాయి. 21వ నిమిషంలో స్పెయిన్ తరఫున మార్టిన్ జుబిమెండి తొలి గోల్ చేయగా, ఐదు నిమిషాల వ్యవధిలోనే పోర్చుగల్ ఆటగాడు న్యూనొ మెండెస్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.
Read Also: YS Jagan: కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా..? ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ సీఎం..!
తర్వాత తొలి అర్ధ భాగం చివర్లో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ మరో గోల్ చేసి తన జట్టును 2-1తో ముందుకు తీసుకెళ్లాడు. అయితే, రెండో భాగంలో పోర్చుగల్ తిరిగి పోటీలోకి వచ్చింది. 61వ నిమిషంలో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గోల్ చేసి స్కోరును మళ్లీ సమం చేశాడు. ఇది రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌లో 138వ గోల్. ఇక నిర్ణీత సమయం, అదనపు సమయాల్లోనూ 2-2తో మ్యాచ్ నిలవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ పోర్చుగల్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది.
Read Also: Renu Desai : నిజాయితీగా ఉండాలంటే.. దేనికైనా సిద్ధంగా ఉండాలి
పెనాల్టీ షూటౌట్ లో స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో విజయవంతంగా గోల్స్ సాధించగా.. నాలుగో కిక్ వేయడానికి వచ్చిన అల్వారో మొరాటా ప్రయత్నాన్ని పోర్చుగల్ గోల్‌కీపర్ డీగో కోస్టా చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఇదే టర్నింగ్ పాయింట్‌గా నిలిచి పోర్చుగల్ విజయానికి బాటలు వేసింది. పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్‌హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ పెనాల్టీల్లో విజయవంతంగా గోల్స్ చేయడంతో 5-3 తేడాతో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక విజయానంతరం జట్టు విజయంలో కీలకంగా నిలిచిన రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విజయంతో పోర్చుగల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంది.