NTV Telugu Site icon

Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి

Ponnam

Ponnam

Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు.

మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.

Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..

ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, కులగణన సర్వే ద్వారా 1,51,000 దరఖాస్తులు, మీసేవ ద్వారా అర్బన్‌లో 15,070, రూరల్‌లో 12,500 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 75,000 పైచిలుకు దరఖాస్తులు రాగా, మీసేవ ద్వారా 23,000 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మాత్రమే కార్డులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేసింది. అయితే, మిగిలిన గ్రామాల ప్రజల్లో దీనిపై అసంతృప్తి వ్యక్తమైంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇప్పుడు కోడ్ లేని ప్రాంతాల్లో – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో – తిరిగి పంపిణీ మొదలుకానుంది. అయితే, మొత్తం లబ్ధిదారులకు కాకుండా, ముందుగా 1 లక్ష కార్డులు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా అత్యవసరంగా రేషన్ కార్డులు అవసరమైన నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 5.12 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైతే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి గడువు తేదీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవా కేంద్రాల ద్వారా రూ.50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్తితిని తెలుసుకోవడానికి రిఫరల్ నంబర్ కూడా అందించనున్నారు.

Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..