బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా.. త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కేటీఆర్ ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా అంటూ కేటీఆర్‌కి పొంగలేటి సవాల్ విసిరారు. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్లో ఉంటావా? అంటూ విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చాయో.. స్థానిక ఎన్నికల్లో కూడా అంతే సీట్లు వస్తాయని పొంగులేటి వ్యాఖ్యానించారు.
ఖమ్మం రూరల్ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి మళ్లీ ఎలా గెలుస్తారో చూద్దాం అని అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు కనిపించనిది, వినిపించనిది.. ప్రతిపక్షంలో కనిపిస్తుంది అంటే విడ్డూరం, హాస్యాస్పదంఆ ఉంది. విభజన సమయంలో రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రధాన పార్టీ కాంగ్రెస్. నాడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది. మా ప్రభుత్వం పేదోళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే కొంతమంది విషం కక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు?. కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టాలనుకున్నారు కానీ.. పేదోడికి డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. పేదోడికి ఇల్లు కట్టించి ఉంటే మీకు నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటే.. మీకు ఒళ్ళంతా విషం ఉంటుంది. రెండు పర్యాయాలు మీకు బుద్ధి చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పాలి’ అని పొంగులేటి ఫైర్ అయ్యారు.
Also Read: Gutha Sukender Reddy: పునరాలోచన చేసుకోమని చెప్పా.. కవిత రాజీనామాపై స్పందించిన గుత్తా!
‘మీ కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు. మీ సోదరిమణి (కేటీఆర్‌ను ఉద్దేశించి) సమస్య, మీ బిడ్డ సమస్య (కేసీఆర్‌ను ఉద్దేశించి)ను మా సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టే యత్నం చేస్తున్నారు. మొన్న ట్విట్టర్ టిల్లు ఏదో మాట్లాడుతున్నాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికల గురించి కాదు మాట్లాడేది.. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకో. మీ పార్టీ శాసన సభ్యులు ఆరోగ్యం బాగాలేక చనిపోయారు, దానికి 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మీకు ఉన్న పరిజ్ఞానం, విషన్ గురించి నేను మాట్లాడను. కేటీఆర్.. ముందుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చూడు. బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా, ఫారిన్ వెళ్తావా చూడాలి. జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత మీ పార్టీ స్థానం ఏంటో చూడు నాయన ట్విట్టర్ టిల్లు. మీ దయ దాక్ష్యాణ్యాలతో ఎవరు బిఫామ్ తీసుకోలేదు. మీ నాయన మూడు సార్లు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏమి చేయలేకపోయాడు, నువ్వెంత బచ్చాగాడివి. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషీ పార్టీ కాదు, ఇచ్చిన మాట కోసం నిలబడి నెరవేర్చే పార్టీ. ఈ పార్టీలో ఏ ఒక్కరు తప్పు చేయరు. తల కిందులూ పెట్టిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చాయో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే సీట్లు వస్తాయి’ అని పొంగులేటి అన్నారు.