Polling: దేశంలో 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇవాళ ముగిసింది. గురవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత లైన్ నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి పోలింగ్ అధికారులు ఓటర్లను బూత్‌లోకి అనుమతించారు.
మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరిగాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకంగా మారాయి. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి.
అంధేరి ఈస్ట్: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయి. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ అందేరి ఈస్ట్‌లో ఎన్నికలు జరిగాయి. శివసేన ఉద్ధవ్ వర్గం లత్కే భార్య రుతుజా లత్కేను బరిలోకి దింపితే.. బీజేపీ ముర్జీ పటేల్‌ను ఎన్నికల్లో నిలబెట్టింది. ఏక్ నాథ్‌షిండే వర్గం బీజేపీకి మద్దతు ఇస్తోంది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరిగే బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు ఈ ఎన్నిక కీలకంగా మారింది.
మొకామా, గోపాల్ గంజ్(బీహార్): మొకామా సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై అనర్హత వేటు పడటంతో ఈ ఎన్నికలు వచ్చాయి. ఇక గోపాల్ గంజ్ నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. మొకామాలో అనంత్ సింగ్ భార్య నీలం దేవీ ఆర్జేడీ తరుపున బరిలోకి దిగగా.. బీజేపీ సోనమ్ దేవీని బరిలో నిలిపింది. గోపాల్ గంజ్‌లో సుభాష్ సింగ్ భార్య కుసుమ్ దేవీని, ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తా ఢీకొన్నారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీకి సీఎం నితీష్ కుమార్ జేడీయూ మద్దతు తెలిపింది.
ఆదంపూర్, హర్యానా: సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది. బీజేపీ నుంచి బిష్ణోయ్ కొడుకు భవ్య, కాంగ్రెస్ నుంచి జై ప్రకాష్, ఆప్ నుంచి సత్యేందర్ సింగ్ పోటీలో ఉన్నారు.
గోల గోకరనాథ్, ఉత్తర్ ప్రదేశ్: బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణించడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. బీజేపీ నుంచి అరవింద్ గిరి కుమారుడు అమన్ గిరి బరిలో నిలుస్తుండగా.. సమాజ్ వాదీ పార్టీ నుంచి వినయ్ తివారీ బరిలో ఉన్నారు. రైతుల మరణానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ పార్లమెంట్ పరిధిలో ఈ గోల గోకరనాథ్ ఉంది.
ధామ్ నగర్, ఒడిశా: బీజేపీ నేత బిష్ణు చరణ్ సేథీ మరణంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయింది. ఆయన కుమారుడు సూరజ్ స్థితప్రజ్ఞ బరిలో నిలవగా.. బీజేడీ నుంచి అబంతి దాస్, కాంగ్రెస్ నుంచి హరే కృష్ణ సేథి బరిలో ఉన్నారు.
మునుగోడు, తెలంగాణ: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి మధ్య పోటీ నెలకొంది.