NTV Telugu Site icon

Vizag Steel Plant: హీట్‌ పెంచుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌.. టార్గెట్‌ కేసీఆర్‌..!

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్‌ ఆదేశించారని చెబుతున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరనసల్లో బీఆర్ఎస్‌ ఏపీ నేతలు పాల్గొనడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది..

ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది తమ స్టాండ్ అన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న వార్తలే తప్ప, ఇంతవరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నుండి కానీ, తెలంగాణ ప్రభుత్వం నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్నారాయన. అయితే, స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న వార్తలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా స్పందించారు. ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్‌నగర్‌ పేపర్‌మిల్‌ తెరవాలన్నారు బండి. తెలంగాణ ప్రభుత్వం నిజంగా దీనిపై నిర్ణయం తీసుకుందా లేదా ఇదంతా ప్రచారమేనా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న ప్రచారం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ఆచితూచి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే ప్రయత్నం తొలి దశ నుంచి వైసీపీ చేస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి.. ప్రధాని వద్ద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించారన్న ఆయన.. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు పార్టీలు ఇంత కాలం ఏం చేశాయి ? అని నిలదీశారు..