ఐటీ హబ్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టే వ్యూహంలో భాగంగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్‌లో చేపట్టిన ఈ మాన్యువల్ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణించగా, డబుల్ రైడర్లు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అంటే డబుల్ రైడర్ల కంటే సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తోందని ఈ సర్వేలో స్పష్టమైంది.
Also Read:SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!
ఒక్కొక్కరు ఒక్కో వాహనంపై ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ప్రయాణికులు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ప్రయాణ సమయం వృధా కావడంతో పాటు అదనపు ఇంధన ఖర్చులు, ప్రమాదాల రిస్క్, శారీరక అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనికి తోడు వాహనాల నుండి వెలువడే కార్బన్ ఉద్గారాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసినప్పటికీ, అధిక శాతం మంది ఒంటరిగా ప్రయాణించడానికే మొగ్గు చూపడం ఆశ్చర్యకరమని, ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఈ సర్వే కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ-I హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ఎస్ హెచ్ఓ శ్రీధర్ కుమార్, ఆర్.ఐ శ్రీకాంత్, ఎస్ఐలు టీవీ రావు, రాములు సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఐటీ ఉద్యోగులు, సాధారణ పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ రహిత సైబరాబాద్‌ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Also Read:Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..
ఈ సందర్భంగా పోలీసుల ముఖ్య సూచనలు
సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించండి.
సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయండి.
మెట్రో, బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచండి.
పీక్ అవర్స్‌లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి.
పాఠశాల, కళాశాల వాహనాలు నడిచే రద్దీ సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోండి.
