PM Modi to Visit Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్నారు.. రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేయనున్న ఆయన.. 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు.. ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుని.. ఆలయంలో గడపనున్నారు.. ఇక, 8:55 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ముగించుకోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు.. ఉదయం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
Read Also: Elephants Died: జార్ఖండ్‌లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.. ఈ పర్యటన మధ్యలోనే తిరుమలకు వెళ్లిరానున్నారు.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జిల్లాలోని అధికారులు.. భద్రతపై దృష్టి సారించారు. ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నట్టుగా తెలుస్తోంది.. గతంలో తిరుమలకు వచ్చిన మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికి, ఇరువురు నేతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ 26వ తేదీన తిరుపతికి వస్తారని అంచనా వేస్తున్నారు. మోడీ తిరుమలలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మరియు ప్రధాని మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. అయితే సాంప్రదాయకంగా, అటువంటి పర్యటనల సమయంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రధానితో చర్చించడానికి అవకాశాన్ని తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.