PM Modi Tirumala Tour: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి, తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకోనున్నారు నరేంద్ర మోడీ. ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వాగతం పలకనున్నారు.
Also Read: Rahul Gandhi: ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు
రాత్రి 7:55 గంటలకు తిరుమలలోని శ్రీ రచనా అతిధి గృహానికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. శ్రీరచనా అతిధి గృహం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీ రచనా అతిధి గృహాల డోనార్ తుమ్మల రచనా చౌదరి స్వాగతం పలకనున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి శ్రీవారిని ప్రధాని మోడీ దర్శనం చేసుకోనున్నారు.