Rajmata Vijaya Raje Scindia: భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యురాలు, జనసంఘ్ ప్రముఖ నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు నివాళులు అర్పించారు. సామాజిక సేవ పట్ల ఆమె అంకితభావం, భారతీయ సంస్కృతిపై ఆమెకున్న విశ్వాసం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “రాజమాత విజయరాజే సింధియా జీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు. సమాజానికి సేవ చేయడానికి ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. జనసంఘ్, బీజేపీలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. విజయరాజే సింధియా జీ మన సాంస్కృతిక మూలాల పట్ల ఎంతో మక్కువ కలిగి ఉన్నారు. వాటిని రక్షించడానికి, ప్రాచుర్యం పొందేందుకు ఎల్లప్పుడూ కృషి చేశారు.” అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: AmalaPaul : అమల పాల్.. ఫోటోలు అదరహో..
అసలు ఎవరు ఈమే..?
“గ్వాలియర్ రాజమాత”గా పిలువబడే విజయరాజే సింధియా అక్టోబర్ 12, 1919న మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జన్మించారు. ఆమె సింధియా రాజకుటుంబంలో ప్రముఖ సభ్యురాలు. తన జీవితంలో ఎక్కువ భాగం ప్రజా సేవ, జాతీయ సంక్షేమానికి అంకితం చేశారు. భారతీయ జనసంఘ్ ప్రారంభంలో పార్టీని నడిపించడానికి కృషి చేశారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి ఉద్యమించిన నాయకురాలిగా నిలిచారు. విజయరాజే సింధియా ఏడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. వివిధ పదవులను నిర్వహించినప్పటికీ.. ఎల్లప్పుడూ నిజాయితీ, త్యాగం, సమగ్రతకు ఉదాహరణగా నిలిచారు. ఆమె జనవరి 25, 2001న మరణించారు. కానీ ఆమె ఆలోచనలు, సహకారాలు భారత రాజకీయాలకు, దేశ సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీతో సహా అనేక మంది బీజేపీ నాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. రాజమాత సింధియా ఆదర్శప్రాయమైన జీవితం ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉంటుందని పలువురు ప్రముఖ నాయకులు పేర్కొన్నారు.