NTV Telugu Site icon

AB PM-JAY: వృద్ధులకు ప్రధాని మోడీ దీపావళి కానుక.. ఏటా 5 లక్షల వరకు..

Ab Pm Jay

Ab Pm Jay

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు రూ.12,850 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ ప్రధాన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్స కూడా పొందగలరు. తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవం, హిందూ వైద్య దేవుడైన ధన్వంతరి జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్‌ కోసం ఉద్దేశించిన యూ-విన్‌ పోర్టల్‌ (U-WIN)ను కూడా ప్రారంభించారు.

ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స..

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంటుంది. దీని వల్ల దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మందికి పైగా పెద్దలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు ఈ పథకంలో తక్కువ ఆదాయ వర్గ కుటుంబాలను మాత్రమే చేర్చారు. అయితే వృద్ధుల కోసం ప్రారంభించిన ఈ పథకంలో ఇకపై ఆదాయ పరిమితి ఉండదు. అంతే కాకుండా ఒకే కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది.

వృద్ధులకు ఉచిత చికిత్స ఎలా లభిస్తుంది?
ఈ పథకం కోసం.. వృద్ధులకు ప్రత్యేక ఆయుష్మాన్ కార్డు అందించనున్నారు. ఇది కుటుంబ ఆయుష్మాన్ ప్లాన్‌కు భిన్నంగా ఉంటుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ప్రత్యేక కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పలువురు వృద్ధులకు కార్డులు అందజేశారు. ఈ సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ కార్డ్‌లు బీఐఎస్ (BIS) పోర్టల్/ఆయుష్మాన్ యాప్ ద్వారా తయారు చేస్తున్నారు. దీని కోసం వృద్ధులు తమ ఆధార్ కార్డ్, కేవైసీ (KYC)ని కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వృద్ధులు ప్రైవేట్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్సూరెన్స్‌లో ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Show comments