NTV Telugu Site icon

PM Modi: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్‌ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. దీనిని కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మంగళగిరి ఎయిమ్స్‌లోని 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. కాకినాడలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను మోడీ ప్రారంభించారు. యానాం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన జిప్‌మర్‌ మల్టీస్పెషాలిటీ యూనిట్‌ను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.

Read Also: Uttarakhand: ఆందోళనల్లో “ఆస్తి నష్టాన్ని రికవరీ చేసేందుకు బిల్లు”ని తీసుకురానున్న ఉత్తరాఖండ్..

మంగళగిరి ఎయిమ్స్‌లో 2019 మార్చి నుంచే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేల మంది రోగులు అక్కడ వైద్యం పొందుతున్నారు. 2018 నుంచే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రస్తుతం 600 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 100 మంది వివిధ కోర్చుల్లో పీజీ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఏపీ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు జీవిఎల్, సీఎం రమేష్, అధికారులు పాల్గొన్నారు.