PM Modi: దేశ యువతను చూస్తే గర్వకారణంగా ఉందని.. భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే అని ప్రధాని మోడీ అన్నారు. దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుంది.. జీవితం చాలా పరీక్షలు పెడుతోంది.. అన్నింటిలో నెగ్గాలి.. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు. శనివారం IIT ఢిల్లీ 57వ కాన్వొకేషన్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని, యువ గ్రాడ్యుయేట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడిన తీరు, జోడించిన సరదా వ్యాఖ్యలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సభలో ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ముసిముసి నవ్వులతో మాట్లాడారు. “ప్రస్తుతం మీరంతా ఈ వేడుకలో కూర్చుని ఉన్నప్పటికీ, మీ మనస్సుల్లో మాత్రం భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. నేనేమీ బాబా బాగేశ్వర్‌ని కాదు, మీ మనసులో ఏముందో సరిగ్గా చెప్పడానికి.. కానీ ఏవో ఒక ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఓడుతూనే ఉంటాయి కదా!” అంటూ నవ్వులు పూయించారు. ప్రతీ విద్యార్థికి రేపటి గురించి ఓ విభిన్నమైన కల ఉంటుందని పేర్కొన్నారు. కొందరేమో తమ మొదటి ఉద్యోగం, అందుకునే తొలి జీతం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటే, మరికొందరు స్వంతంగా స్టార్టప్ ప్రారంభించాలని కలలు కంటుండవచ్చని అన్నారు. ఇంకొందరు ఉన్నత చదువులు లేదా పోటీ పరీక్షల తయారీని లక్ష్యంగా పెట్టుకుని ఉండవచ్చని తెలిపారు. కలలు, లక్ష్యాలు వేరైనా, ప్రతి ఒక్కరిలోనూ ఇవాళ ఒకే రకమైన ఉత్సాహం ఉప్పొంగుతోందని వ్యాఖ్యానించారు.
విద్యార్థులను ఐఐటీ ఢిల్లీలో గడిపిన తమ మొదటి రోజుకు తీసుకువెళ్తూ.. నిన్ననే ఓరియంటేషన్ జరిగినట్లుగా అనిపిస్తోందని, కానీ అంతలోనే కాన్వొకేషన్ రోజు వచ్చేసిందని, నేటితో మీ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. నేడు ప్రపంచంలో గ్లోబల్ ఆర్డర్ వేగంగా మారిపోతోందని, దానికి సాంకేతికత ప్రధాన కారణమని స్పష్టం చేశారు. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఎలా రూపాంతరం చెందుతుందో అంచనా వేయడం కష్టమని, అయితే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండే వ్యక్తులు మాత్రమే ఈ మార్పులను తట్టుకుని ముందంజలో ఉంటారని హితవు పలికారు. విజేతలకు పతకాలు అందజేస్తూ వారి సాధనను అభినందించిన మోడీ, ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించారు. మెడల్స్ సాధించిన వారిలో బాలికల సంఖ్య తక్కువగా ఉండటంపై స్పందిస్తూ, “ఒకరిద్దరు మాత్రమే కాకుండా ఈ జాబితాలో మరికొందరు అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుండేది” అని ఆకాంక్షించారు.
స్వాతంత్య్ర పోరాట కాలాన్ని, నాటి తరం చేసిన త్యాగాలను స్మరించుకున్న ప్రధాని, ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు తరం దేశానికి స్వేచ్ఛను తీసుకురావడమే లక్ష్యంగా సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలు చేసిందని, వారి కష్టం వల్లే నేడు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నామని చెప్పారు. నాటితో పోలిస్తే నేటి సవాళ్లు, బాధ్యతలు వేరని ఐఐటీయన్లకు స్పష్టం చేశారు. రాబోయే 30-35 ఏళ్లలో విద్యార్థులు చేపటే ప్రతి పని వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల దేశానికి జరిగే మేలు, తీరే అవసరాల గురించే ముందుగా ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.

